మువుంబీ ఎండ్జాలమాకు చిన్న వయసులో వైవాహిక సంబంధాల గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తేవి.
“మీరిద్దరూ మీ జీవితాంతం ఇలాగే కలిసుంటారా?” అని తన తల్లిదండ్రులను అడగడం ఆమెకు ఇప్పటికీ గుర్తుంది. “మన జీవితంలో మనుషులు కూడా కాలానుగుణంగా మారిపోతూ ఉండాలని నేను అనుకునేదాన్ని. కానీ, సినిమాల నుంచి, స్థానిక చర్చిల వరకూ అన్నీ మోనోగమీ (ఒకే పెళ్లి చేసుకోవాలని) గురించే చెబుతూ ఉండేవి. ఆ కాన్సెప్ట్ నాకు అసలు అర్థం కాలేదు”అని ఆమె చెప్పారు. ఇప్పుడు మువుంబీకి 33 ఏళ్లు. ఆమె తనను తాను ఒక పాలీఅమొరస్ (ఒకరికి మించి ఎక్కువమందితో లైంగిక సంబంధాలు), పాన్‌సెక్సువల్ (లింగ బేధం లేకుండా లైంగిక సంబంధాలు) మహిళగా చెప్పుకుంటారు.
తనలాగే ఒకరిని మించి లైంగిక భాగస్వాములు ఉన్న వారికి దక్షిణాఫ్రికాలో ఒక సురక్షిత స్థానాన్ని సృష్టించే పనిలో ఉన్నారు. ”ప్రస్తుతం యాంకర్‌గా పనిచేసే ఒక వ్యక్తితో కలిసుంటున్నాను. మాకు పిల్లలు కూడా ఉన్నారు. నా మరో పార్టనర్ కూడా మమ్మల్ని చూసి సంతోషిస్తున్నారు” “ఆయన నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. కానీ, భవిష్యత్తులో నేను నా పెళ్లిని ఒకరి కంటే ఎక్కువ మందితో ఊహించుకుంటున్నాను. పాన్‌సెక్సువల్ అయిన నేను.. వారు ఆడా, మగా, ఏ లింగం అనేదానితో సంబంధం లేకుండా ఆకర్షణకు గురవుతుంటాను” అని మువుంబీ చెప్పారు.
ప్రపంచంలో అత్యంత ఉదారవాద రాజ్యాంగాలున్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. ఇక్కడ స్వలింగ వివాహాలతో పాటు పురుషులు ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి కూడా అనుమతిస్తున్నారు. ఈ దేశం ఇప్పుడు తమ వైవాహిక చట్టాలను మరింత అప్‌డేట్ చేయాలని ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా మహిళలు ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మంది భాగస్వాములను కలిగుండేలా బహుభర్తృత్వాన్ని అనుమతించాలా వద్దా అనేదానిపై ప్రజల అభిప్రాయాలు అడిగింది. దీనిపై దేశంలోని సంప్రదాయ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
“ఇది ఆఫ్రికా సంస్కృతిని నాశనం చేస్తుంది. వారికి పుట్టే పిల్లల పరిస్థితి ఏంటి. తమ గుర్తింపు గురించి వారికి ఎలా తెలుస్తుంది. మహిళలు ఇప్పుడు పురుషుల పాత్రను తీసుకోలేరు. ఇలాంటిదెప్పుడూ వినలేదు. పురుషుల్లా ఇప్పుడు మహిళలు లొబోలా(కన్యాశుల్కం లాంటిది) చెల్లిస్తారా. మగాళ్లు తమ ఇంటిపేరు పెట్టుకోవాలని అనుకుంటున్నారా” అని ఆ దేశ వ్యాపారవేత్త, టీవీ నటుడు మూసా ఎంసెలెకూ అన్నారు. ఆయనకు నలుగురు భార్యలు ఉన్నారు. ఇది సమాజాన్ని నాశనం చేస్తుందని దక్షిణాఫ్రికాలో విపక్షమైన ఆఫ్రికన్ క్రిస్టియన్ డెమాక్రటిక్ పార్టీ(ఏసీడీపీ) నేత రెవెరెండ్ కెన్నెత్ మెషో లాంటి వారు అంటున్నారు. “ముందు ముందు నువ్వు తనతోనే ఎక్కువ సమయం గడుపుతున్నావ్, నాతో గడపడం లేదు అనే గొడవలు కూడా వస్తాయి. ఆ ఇద్దరు మగాళ్లు కొట్టుకోవడం కూడా జరుగుతుంది” అన్నారు.