వారణాసిలో జ్ఞానవాపి మసీదు గురించి చర్చ నడుస్తున్న సమయంలో తెరపైకి మరో హాట్ టాపిక్ వచ్చింది. ఇక మథురలోని షాహీ ఈద్గా మసీదు వంతు మొదలైంది. మసీదు ఉన్న ప్రాంతం శ్రీకృష్ణుడి జన్మస్థలం అన్న వాదన ఎప్పటి నుంచో ఉన్నదీ.
అక్కడ నమాజు చేయడం ఆపాలని మసీదును అక్కడ నుంచి తొలగించాలన్న డిమాండ్‌లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మథుర కోర్టు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. షాహీ ఈద్గా మసీదులో సర్వే చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది, ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
వారణాసిలో జ్ఞానవాపి మంటలు ఇంకా ఆరనేలేదు. కోర్టుల్లో పంచాయితీ నడుస్తునే ఉంది. అంతలోనే అదే తరహాలో మరో వివాదం తెరపైకొచ్చింది. అక్కడ శివుడు ఇక్కడ కృష్ణుడు, అది వారణాసి ఇది మథుర అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ అని అన్నారు.
వారణాసి జ్ఞానవాపి మసీదు సర్వే వివాదం కొనసాగుతుండగా, మథురలో అలాంటిదే మరో పిటిషన్ దాఖలైంది. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ ప్రాంతానికి ఆనుకొని ఉండే షాహీ ఈద్గా మసీదులో సర్వే చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు మథుర కోర్టు అంగీకరించింది.
13.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కృష్ణుడి ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చి ఈ మసీదు నిర్మించారన్నది పిటిషనర్ల వాదన. అందుకే షాహీ ఈద్గా ప్రాంగణంలో వీడియో సర్వే చేయించి నిజాలు నిగ్గు తేల్చాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర రచ్చ రేపుతున్న సమయంలో మథురలోని మసీదు పంచాయితీ కోర్టు మెట్లెక్కడంతో అందరి చూపు దానిపైనే పడింది.
గతకొంత కాలంగా మథురలోని షాహీ ఈద్గా మసీదు చుట్టూ ఓ రేంజ్‌లో వివాదం నడుస్తోంది. ఇక్కడ శ్రీకృష్ణుడి ఆలయాన్ని ఆనుకుని మసీదు ఉంటుంది. ఇటు శ్రీకృష్ణుడి ఆలయంలో భజనలు చేసిన అటు మసీదులో నమాజులు చేసినా స్పష్టంగా వినిపిస్తాయి.
మసీదునే అక్కడి నుంచి పూర్తిగా తొలగించాలన్న డిమాండ్‌లు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. పదుల సంఖ్యలో కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.
ఈ మసీదును మూసివేయకపోతే మతపరమైన స్వభావం మారిపోతుందని అందుకే ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు.
అయితే చాలా సార్లు ఇలాంటి వివాదాస్పద పిటిషన్లను కోర్టులు విచారణకు స్వీకరించలేదు. అయినా వివాదం కొనసాగుతునే ఉంది. ఇలాంటి సమయంలో మథుర కోర్టు సర్వేపై వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం సంచలనంగా మారింది.
షాహీ ఈద్గా మసీదుకు శతాబ్దాల చరిత్ర ఉంది. దీన్ని 1669-70 మధ్యలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నిర్మించాడు. అయితే మసీదు నిర్మాణం కోసం వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయాన్నికూల్చి వేసినట్లే ఔరంగజేబు మథుర ఆలయాన్నీ కూడా ధ్వంసం చేశాడన్నది హిందూ ధార్మిక సంస్థలు వాదిస్తున్నాయి.
దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పటికీ ఉన్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు వీడియో సర్వేకు అంగీకరిస్తే అప్పుడు ఎవరి వాదనలో ఎంత నిజముంది? ఎవరి వాదనలో ఎంత పస ఉంది? అన్నది తేలిపోనుంది.
అంతేకాదు శతాబ్దాల కాలంగా బయటకు రాని నిజాలు కూడా నిగ్గు తేలనున్నాయి. అసలు శ్రీకృష్ణుడి జన్మస్థలంలో మసీదును నిర్మించారా, లేదా అనేది శతాబ్దాల క్రితం ఔరంగజేబు హయాంలో అసలేం జరిగింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే చారిత్ర ఆధారాలు తప్పనిసరి ఆధారాలు లేకపోతే కోర్టులు హిందూ ధార్మిక సంఘాల వాదనలను పరిగణలోకి తీసుకోవు.