బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. యాస్ తుపాను వచ్చిన నాలుగు నెలలకే తాజా తుపాను విరుచుకుపడుతోంది.
ఉత్తరాంధ్ర -దక్షిణ ఒడిశా మధ్య గులాబ్ తుపాను తీరాన్ని తాకిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు ప్రకటించారు. కళింగపట్నంకు ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో తుపాను తీరాన్ని తాకిందని, ఇది పూర్తిగా తీరం దాటడానికి మూడు గంటల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తుపాను తీరం దాటుతుందని, ఈ సమయంలో ఉత్తరాంధ్రలో సముద్ర తీరం వెంబడి గంటకు 75-95 కిలోమీటర్ల వేగంతో ఈదురగాలులు వీస్తాయని తెలిపారు. కాబట్టి ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని హెచ్చరించారు.
తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లకు అడ్డంగా చెట్లు పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు శ్రీకాకుళం నగరంతో పాటు తీర ప్రాంత మండలాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సహయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిల్లా పోలీసు యంత్రాగం సహాయ చర్యలు చేపట్టారు. విద్యుత్ లేకపోవడంతో మినీ ల్యాంప్స్, సెల్ ఫోన్ వెలుగులోనే విరిగిన చెట్లను తొలగిస్తున్నారు.
ఇవాళ మధ్యాహ్నం నుంచి సముద్రంలో అలల తీవ్రత ఎక్కవకావడంతో పలాస నియోజకవర్గం మంచినీళ్ల పేటకు చెందిన మత్సకారుల బోటు బోల్తాపడింది. రెండు రోజులు క్రితం కొత్త బోట్ కొనేందుకు ఆరుగురు మత్స్యకారులు ఒడిశా వెళ్లారు, అక్కడ బోట్ కొనుక్కొని సముద్ర మార్గం ద్వారా మంచినీళ్ళపేట వస్తుండగా ఈ రోజు మధ్యాహ్నం అక్కుపల్లి సముద్ర ప్రాంతంలో అలజడుల కారణంగా బోటు బోల్తాపడింది. ఆ సమయంలో బోటులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు బోటు నుండి సముద్రంలోకి పడిపోయారు. ఈ విషయాన్ని అదే బోటులో ఉన్న మరొక వ్యక్తి పిట్ట హేమారావు జరిగిన సంఘటనను గ్రామస్థులకు ఫోన్ ద్వారా సమాచారం తెలిపారు.
అయితే ప్రస్తుతం హేమరావు ఫోనుకు కూడా అందుబాటులోకి రావడం లేదు. ఇదే సమయంలో సాయంత్రం ఏడు గంటల సమయంలో గల్లంతైన ఆరుగురులో ముగ్గురు మత్స్యకారులు తాము క్షేమంగా ఉన్నట్లు మంత్రి సిదిరి అప్పలరాజుకు ఫోను ద్వారా తెలియపర్చారు. అయితే మరో ఇద్దరు మరణించారు, ఒకరి అచూకీ తెలియడం లేదని చెప్పారు. “పది మైళ్లు ఈదుకుంటూ వచ్చాం. ప్రమాదం జరిగినప్పుడు హేమరావు ఒక్కడే బోటులో ఉన్నాడు. మిగతా ఐదుగురం కింద పడిపోయాం. ఇప్పుడు హేమరావు ఎక్కడున్నాడో తెలియడం లేదు. దయచేసి అతడ్ని వెతికించండి.” అని మంత్రి సిదిరి అప్పలరాజుతో క్షేమంగా బయటపడిన మత్స్యకారుడు వంక చిరంజీవి వేడుకున్నారు.