ప్రకాశ్ రాజ్ ఇంటర్వ్యూ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు నాకు ఏం సంబంధం? నేనక్కడ లోకల్ కాదు

తెలుగు చిత్రపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి రాజుకుంది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు.

మా ఎన్నికలకు సంబంధించి తమ విధివిధానాలు, హామీలపై ప్రకాశ్ రాజ్ బీబీసీ తెలుగుతో మాట్లాడారు. ఆ వివరాలు ప్రశ్న-సమాధానాల రూపంలో..ప్రశ్న: ప్రచారం ఎలా సాగుతోంది? వ్యూహం ఏమిటి? అందరినీ కలవడం పూర్తయిందా? సమాధానం: అందరినీ కలుస్తున్నాం. లేఖలు రాస్తున్నాం. ఫోన్ చేస్తున్నాం. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి హామీలేంటి? ఎవిరిని నమ్మాలి? అని ఎన్నుకోవాల్సింది ‘మా’ సభ్యులు. గెలుపైనా ఓటమి అయినా వారిదే. సరైనవారిని ఎన్నుకుంటే వారు గెలుస్తారు. వాళ్ల ఇష్టం. మనం ఓటు అడుగుతాం అంతే.

ప్రశ్న: హామీల విషయంలో ‘మా’ భవనం అంశం బాగా చర్చనీయమైంది. సొంత ఖర్చుతో భవనం నిర్మిస్తామని మంచు విష్ణు ప్యానల్ హామీ కూడా ఇచ్చింది. ఆ భవనం మీ దృష్టిలో కూడా ప్రాధాన్యాంశమేనా? సమాధానం: అసలు భవనం అంటే ఏంటి అనే స్పష్టత కావాలి. అది ఒక బిల్డింగ్ కాదు. రెండు అంతస్తులు కట్టి, ఫీస్, స్టాఫ్, మీటింగు పెట్టుకునే చోటు కాదు. భవనం అనేది మన ఇల్లు అవ్వాలి. కేరాఫ్ అవ్వాలి. కళా భవనంలా, ఒక ఫృథ్వీ థియేటర్‌లా, రవీంద్ర భారతిలా మా థియేటర్స్ ఉండాలి. ప్రొజెక్షన్ థియేటర్స్ ఉండాలి. ఆర్టిస్టులకు స్పేస్ ఉండాలి. నాటకాల రిహార్సల్స్ వంటివి జరుపుకొనేలా ఉండాలి. కమ్యూనిటీ హాల్ ఉండాలి. సెల్ఫ్ సస్టెయినబిలిటీ రావాలి.

నెల నెలా సంఘం కొంత సంపాదించగలగాలి. ఇలా ఎన్ని సంవత్సరాలు వాళ్లనీ వీళ్లనీ అడుగుతూ డొనేషన్లపై బతుకుతుంది ఈ సంఘం? అలాకాదు కదా! ఏ వ్యవస్థ అయినా తన కాళ్లపై నిలబడగలగాలి. ఒక లైబ్రరీ కావాలి. ఆ భవనం మన వైభవం కావాలి. ఇది చాలా పెద్ద కల. ఏదో చిన్న సైట్ చూసి రెండు ఫ్లోర్లు కట్టడం కాదు. రూ.30-40 కోట్లు అయ్యే పని.

Leave a Comment