జపాన్‌లోని చాలా ప్రాంతాలను లక్ష్యం చేసుకునేలా అధునాతన ‘లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్’ను ఉత్తర కొరియా పరీక్షించినట్లు నార్త్ కొరియా న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) సోమవారం పేర్కొంది.
వారాంతంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో, క్షిపణులు 1500 కిలోమీటర్లు (930 మైళ్లు) దూరం ప్రయాణించినట్లు కేసీఎన్‌ఏ వెల్లడించింది. దేశంలో ఆహార కొరత, ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ఉత్తర కొరియా ఆయుధాలను అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోందని ఈ పరీక్షల ద్వారా తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనలకు లోబడే ఈ పరీక్షలు జరిగాయి. గతంలో వీటిని ఉల్లంఘించిన ఉత్తర కొరియా కఠిన ఆంక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
”దేశ భద్రతలో ప్రజలకు మరింత విశ్వసనీయమైన హామీని ఇవ్వడానికి, శుత్రు సైన్యాల విన్యాసాలను బలంగా అడ్డుకోవడానికి మరొక సమర్థమంతమైన ఆయుధాన్ని కలిగి ఉండాలన్న వ్యూహానికి ఈ క్షిపణుల పరీక్షలు” అద్దం పడుతున్నాయని కేసీఎన్‌ఏ పేర్కొంది. ఈ పరీక్షలను పొరుగు దేశాలతో పాటు అంతర్జాతీయ సమాజంపై ఆధిపత్యం కొనసాగించడానికి ఉత్తర కొరియా చేస్తోన్న ప్రయత్నంగా అమెరికా వ్యాఖ్యానించింది.
‘‘ఇది పెద్ద విషయమా? అని ఆలోచిస్తే ఒకసారి అవును అనిపిస్తుంది, మరోసారి కాదు అనిపిస్తుంది’’అని బీబీసీ సియోల్ కరెస్పాండెంట్ లారా బికర్ విశ్లేషించారు. ‘‘ఇలాంటి క్రూయిజ్ క్షిపణుల జోలికి చాలా దేశాలు పోవు. ఉత్తర కొరియా అణు కార్యక్రమాన్ని అరికట్టడానికి అమలులో ఉన్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలకు ఈ పరీక్షలు లోబడి ఉండవు.’’ ‘‘ప్యాంగ్యాంగ్ నుంచి రెచ్చగొట్టే చర్యగా కొందరు దీన్ని పరిగణిస్తున్నారు. కానీ ఈ పరీక్షలను దక్షిణ కొరియా అంత తీవ్రంగా చూడటం లేదు. అలాగే ఉత్తర కొరియాలో కూడా ఇది పతాక శీర్షికలకు ఎక్కలేదు.’’
ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, అంతర్జాతీయ నిబంధనలకు లోబడి తాము ఆధునాతన, ప్రమాదకరమైన ఆయుధాలను అభివృద్ధి చేయగలమని ఉత్తర కొరియా మరోసారి రుజువు చేసుకుంటోంది. తక్కువ ఎత్తులో ప్రయాణించే ఈ క్రూయిజ్ క్షిపణులను రాడార్లు గుర్తించడం కష్టం. 1500 కి.మీ పరిధి అంటే అది జపాన్‌లో చాలా భాగం వరకు తన ఆధీనంలో ఉంచుకోగలుగుతుంది.
ఈ క్షిపణులను వ్యూహాత్మకమైనవిగా మీడియా వర్ణిస్తోంది. ఇందులో న్యూక్లియర్ వార్ హెడ్‌లను అమర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రూయిజ్ క్షిపణిలో ఇమిడిపోయేలా, ఉత్తర కొరియా న్యూక్లియర్ వార్‌హెడ్‌లను రూపొందించగలదా అనే అంశంపై విశ్లేషకులు స్పష్టతనివ్వలేకపోతున్నారు. అయితే ఆ దేశం సాధించిన పురోగతి ప్రకారం, వార్‌హెడ్‌లను ఇలా ఉపయోగించడం అసాధ్యమని కూడా ఎవరూ చెప్పలేరు. 2019లో హనోయ్ వేదికగా డోనల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ సమావేశమైనప్పటి నుంచి ప్యాంగ్యాంగ్ కాస్త నెమ్మదించి ఉండొచ్చు. కానీ దీనర్థం అప్పటినుంచి వారి ఆయుధాలను అభివృద్ధి చేసే డెవలపర్లు కూడా ఖాళీగానే ఉన్నారని మాత్రం కాదు.