అఫ్గానిస్తాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించడం, తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకోవడంతో భారతదేశంలో అమెరికాపై విశ్వసనీయత సన్నగిల్లినట్లు కనిపిస్తోంది.
అఫ్గానిస్తాన్‌లోని అనేక ప్రాజెక్టుల్లో భారత ప్రభుత్వం అమెరికాతో కలిసి పనిచేసింది. అఫ్గానిస్తాన్‌లో అమెరికా యుద్ధం, అలాగే సేనల ఉపసంహరణ తీరుపై భారతీయ మీడియా, నిపుణులు ఘాటుగా విమర్శిస్తున్నారు. భారతదేశానికి మంచి సంబంధాలున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం అఫ్గానిస్తాన్ నుంచి నిష్క్రమించడం సహజంగానే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా భావించాలి. అఫ్గానిస్తాన్‌లో భారతదేశం పెట్టుబడి పెట్టిన దాదాపు 22 వేల కోట్ల రూపాయల భవిష్యత్తు గురించి కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
అదే సమయంలో అఫ్గానిస్తాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం పాకిస్తాన్ ఉపయోగించవచ్చనే భయం కూడా ఉంది. ఈ తాజా పరిణామాలకు బైడెన్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని భారత మీడియా చెబుతోంది. ”అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా తిరిగి వెళ్లడంతో అంతా గందరగోళంగా మారింది. బీభత్సమైన వాతావరణం అఫ్గాన్లకు విషాదాన్ని మిగిల్చింది. వాస్తవానికి ఇదంతా అమెరికా తప్పు” అని టైమ్స్ ఆఫ్ ఇండియా తన సంపాదకీయంలో పేర్కొంది. ”అఫ్గానిస్తాన్‌లోని పరిస్థితిని భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చు. ఇది దేశం ఎదుర్కోబోయే అతిపెద్ద సవాలు అవుతుంది” అని ఎడిటోరియల్‌లో ఆందోళన వ్యక్తం చేసింది.
”శక్తివంతమైన దేశం చిత్తుగా ఓడింది” అని అఫ్గాన్‌లో తాజా పరిణామాలను విశ్లేషిస్తూ హిందీ వార్తాపత్రిక దైనిక్ భాస్కర్ వ్యాఖ్యానించింది. అమెరికా సుదీర్ఘ యుద్ధం ముగిసింది. ”ఓడిపోయిన సైనికులు” అర్ధరాత్రి కాబుల్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు అని తన రిపోర్టులో పేర్కొంది. ”ప్రపంచ జిహాద్ చరిత్రలో గొప్ప విజయం” సాధించడానికి తాలిబాన్లకు అమెరికా ”సహాయం” చేసిందని భారత వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెలానీ అన్నారు. అఫ్గానిస్తాన్ విషయంలో బైడెన్ వ్యవహరించిన తీరుతో తీవ్రంగా నష్టపోయిన దేశంగా భారత్ అవతరించిందని ఆయన ట్వీట్ చేశారు.
అమెరికా, భారత్ స్నేహితులు కావచ్చు. కానీ అమెరికా విధానం భారత భద్రతను ఎల్లప్పుడూ ప్రమాదంలో పడేసేదిగానే ఉంటోంది. భారతదేశానికి చెక్ పెట్టడానికి మొదట పాకిస్తాన్‌కు ఆయుధాలను సరఫరా చేసింది. ఆపై చైనా ఎదుగుదలకు సాయం అందించిందని చెలానీ పేర్కొన్నారు. అఫ్గాన్ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియకు అమెరికా సహకారం అందించలేదని కొన్ని మీడియా సంస్థలు విమర్శించాయి. కాబుల్ విమానాశ్రయంలోపల దౌత్య కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని భారత్ ఎన్నిసార్లు అడిగినా అమెరికా నిరాకరించిందని ఆరోపించాయి. దాంతో అఫ్గాన్ నుంచి భారత్ తన రాయబార సిబ్బందిని పూర్తిగా వెనక్కి రప్పించాల్సి వచ్చిందని న్యూస్ వెబ్సైట్ క్వింట్ పేర్కొంది.