‘‘చిన్నప్పటి నుంచి ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు వేట చేస్తూనే ఉన్నాను. అప్పట్లో, రెండు మైళ్ల దూరం ఉండే తీరం… ఇప్పుడు చాలా ముందుకు వచ్చింది. రోడ్డు దారి మాత్రమే మిగిలింది. ఏదో ఒక రోజు ఏరు, ఊరు ఒకటైపోతాదేమోనని అనిపిస్తుంది” అన్నారు విశాఖకు చెందిన 68 ఏళ్ల మత్స్యకారుడు అమ్మోరు.
ఇటీవల తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో సముద్రం సుమారు కిలోమీటరు దూరం ముందుకు రావడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చాలా తీర ప్రాంతాల్లోనూ ఇలా సముద్రం ముందుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే, సముద్రం ఇలా ముందుకొస్తే ఆ ప్రాంతం భవిష్యత్తులో జల సమాధి అయిపోతుందని అర్థమా? అంతర్జాతీయ నివేదికలు ఏమంటున్నాయి? ఆంధ్రప్రదేశ్‌లోని శాస్త్రవేత్తలు, నిపుణులు ఏమంటున్నారు?
“80 ఏళ్లలో భారతదేశంలోని 12 తీర ప్రాంత నగరాలు నీట మునిగిపోతాయి. ప్రపంచంలో సముద్ర మట్టం పెరిగే రేటు ఆసియాలోనే ఎక్కువగా ఉంది.” అని ఐపీసీపీ (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్) తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఈ నివేదికపై దేశవ్యాప్తంగా సముద్ర, భూ వాతావరణ నిపుణుల్లో చర్చ జరుగుతోంది. వాతావరణంలో వచ్చిన మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన సంస్థ ఐపీసీసీ. దీనిని 1988లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరానమెంటల్ ప్రోగ్రాం, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా స్థాపించాయి.
తీర ప్రాంత నగరాల అభివృద్దికి సముద్రాలే కారణం. పోర్టులు, పర్యటక ప్రదేశాలు, మత్స్యపరిశ్రమ అభివృద్ధితో ఆయా ప్రాంతాలు నగరాలుగా అభివృద్ధి చెందాయి. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సముద్రాలను కాపాడుకునేలా మనిషి జీవిన విధానం ఉండటం లేదని నిపుణులు అంటున్నారు. విశాఖతో పాటు తీరప్రాంత నగరాలైన ముంబయి, చెన్నై, కొచ్చి, కాండ్లా, ఓఖా, భావ్ నగర్, మంగళూర్, పారాదీప్, ఖిదిర్‌పుర్, తూత్తుకుడి, మోర్ముగావ్‌లు 2100 నాటికి మునిగిపోతాయని ఐపీసీసీ రిపోర్టులో వెల్లడించింది. ఈ సంస్థ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతంలో ఉన్న నగరాలపై రిపోర్టును తయారు చేసింది. ఈ రిపోర్టును స్టడీ చేసేందుకు నాసా (NASA) ప్రొజెక్షన్ టూల్‌ని రూపొందించింది.