కోవిడ్: సేవా గుణమే వీళ్ల ఇమ్యూనిటీ.. కరోనాకు భయపడకుండా బాధితులకు సాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు

కోవిడ్ సమయంలో సహాయం చేసే మనుషులున్నా, సాయం చేయాలనే మనసున్నా కరోనాకి భయపడి అయినవాళ్లు కూడా బాధితుల దగ్గరకు రాలేకపోతున్నారు.

మందులు, ఆహారం, ఆసుపత్రి అవసరాలు, అంత్యక్రియలు ఇలా దేనికీ, ఎవరూ ముందుకు రాని పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాకపోయినా, మేమున్నామంటూ తెలుగు రాష్ట్రాలలోని పలు స్వచ్ఛంధ సంస్థలు కరోనా రోగులకు, మృతులకు సేవలు అందిస్తున్నాయి. కరోనా బాధితులు బయటకెళ్లి మందులు, నిత్యావసరాలు తెచ్చుకోవడం, అవసరమైనప్పుడు ఆసుపత్రికి వెళ్లడం చాలా కష్టమైన పని. అలాగే కరోనా రోగులకు, ముందుకొచ్చి సాయం చేసేవారు కనపడరు. ఎవరినైనా సాయం అడిగినా చేయరు. అది వారి తప్పుకాకపోయినా, ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి.

అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. అంటే, మందులు అందించడం దగ్గర నుంచి, మృతుల అంత్యక్రియల వరకూ అన్ని పనులూ చేసే వలంటరీ అర్గనైజేషన్లు ఇప్పుడు చాలా మందికి అండగా నిలుస్తున్నాయి. ఈ స్వచ్ఛంద సంస్థల్లో ఎక్కువగా యువతే పనిచేస్తున్నారు. వీళ్లంతా చదువు, వ్యాపారాలు, ఉద్యోగాలు కొనసాగిస్తూనే కరోనా కష్టకాలంలో మీకు మేమున్నామంటూ ఎంతోమందికి భరోసా ఇస్తున్నారు. ‘సర్…నా పేరు భార్గవి…ఇవాళ హాస్పిటల్ లో మా నాన్నగారు కోవిడ్ తో చనిపోయారు. మా బంధువులు, హాస్పిటల్ సిబ్బంది ఎవరూ మృత దేహాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్లడానికి రావడం లేదు. మాకేమైనా సహాయం చేయగలరా…? ప్లీజ్…ప్లీజ్…” అంటూ తిరుపతిలోని యునైటెడ్ ముస్లిం అసోసియేషన్, కోవిడ్-19 జేఏసీకు ఫోన్ వచ్చింది. ఆ అసోసియేషన్ సభ్యులు వెంటనే వచ్చి ఆ శవాన్ని అంబులెన్స్ లో శ్మశానానికి తీసుకెళ్లి మృతుడి మతాచారాల ప్రకారం అంత్యక్రియలు చేశారు తిరుపతిలో చాలా ఏళ్లుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అయితే కరోనా తర్వాత, తమను సాయం అడిగే వారి సంఖ్య పెరిగిందని కోవిడ్-19 జేఏసీ అధ్యక్షుడు షేక్ ఇమామ్ సాహెబ్ బీబీసీకి చెప్పారు.

Leave a Comment