ఆస్కార్ 2021: బెస్ట్ డైరెక్టర్‌ అవార్డ్‌తో చరిత్ర సృష్టించిన క్లోయీ జా… విజేతల పూర్తి జాబితా

క్లోయీ జా ఆస్కార్ అవార్డుల వేడుకలో చరిత్ర సృష్టించారు. ఉత్తమ దర్శకురాలిగా అవార్డు గెల్చుకుని ఆ ఘనత సొంతం చేసుకున్న తెల్లజాతికి చెందని తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. మొత్తంగా, ఆమె బెస్ట్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు అందుకున్న రెండవ మహిళ.

చైనాలో పుట్టి, బ్రిటన్‌లో చదువుకుని, అమెరికాలో స్థిరపడిన క్లోయీ జా దర్శకత్వం వహించిన ‘నోమాడ్‌ల్యాండ్’ ఉత్తమ చిత్రం పురస్కారంతో పాటు ఉత్తమ ఎడిటింగ్ అవార్డును కూడా గెల్చుకుంది. పశ్చిమ అమెరికాలోని సాధారణ ప్రజలనే నటులుగా ఎంచుకుని, వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోస్తారని ఆమెను సినీ విమర్శకులు ప్రశంసిస్తుంటారు. అయితే, ఆమె తదుపరి చిత్రం ఈ మార్గానికి భిన్నంగా ఉండబోతోంది. అదే మార్వెల్ కామిక్ సూపర్ హిట్ ‘ఎటర్నల్స్’.

‘ది హర్ట్ లాకర్’ సినిమాకు కేథరిన్ బిగెలో బెస్ట్ డైరెక్టర్‌గా ఆస్కార్ అవార్డును గెల్చుకున్న తొలి మహిళగా సంచలనం సృష్టించిన 11 ఏళ్ల తరువాత ఈ అవార్డు మరో మహిళను వరించింది. బీజింగ్‌లో పుట్టిన క్లోయ జా ఇప్పటికే ప్రతిభావంతురాలైన దర్శకురాలిగా పేరు తెచ్చుకున్నారు. 39 ఏళ్ల క్లోయీ తండ్రి ఉక్కు రంగంలో ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. ఆమె మారు తల్లి సాంగ్ డాండన్ చైనాలో హాస్యనటిగా సుపరిచితులు.

ఆదివారం నాటి ఆస్కార్ పురస్కార వేడుకల్లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డు అందుకున్న తరువాత క్లోయీ మాట్లాడుతూ, “పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు ఎలా ముందుకెళ్లాలీ అన్న ప్రశ్న తలెత్తుతుంది. అప్పుడు నేను నా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతాను. మా నాన్న మాకు చిన్నప్పుడు పద్యాల పోటీ పెడుతుండే వారు. ఒకరు ఒక వాక్యం చెప్పిన తరువాత, మరొకరు ఆ పద్యంలోని మరొక పంక్తి చెప్పాలి. అలా పద్యాన్ని పూర్తి చేసే వాళ్లం. అలా మేం పాడుకున్న వాటిల్లో ‘త్రీ క్యారెక్టర్ క్లాసిక్స్’ ఒకటి. ‘మనుషులంతా పుట్టుకతో మంచివారే’ అన్నది అందులోని ఒక వాక్యం. ఆ వాక్యాన్ని నేను ఇప్పటికీ నమ్ముతాను. నా ప్రయాణంలో నాకు అలాంటి మంచివారు ఎందరో ఎదురయ్యారు. అలాంటి మీ అందరికీ ఈ అవార్డు అంకితం చేస్తున్నాను. మీరే నన్ను ఉత్సాహంతో ముందుకు నడిపిస్తున్నారు” అని అన్నారు.

Leave a Comment