స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, కొల్లు రవీంద్ర, పల్లా శ్రీనివాస్.. సహా పలువురు నేతలు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వట్లేదంటూ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
2010లో కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా మొత్తం కలిపినా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని తీర్పు ఇచ్చింది. తాజాగా మరోసారి ఈ తీర్పును జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని కోర్టు సమర్థించింది.
ఇందిరా సహానీ కేసులో 2016లో వచ్చిన జయరాజు కేసులో కొన్ని మినహాయింపులకు అవకాశాలు ఉన్నాయని, చట్టం ఓపెన్ అని ఉన్నదని రామ్మోహన్నాయుడు తరఫు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ కోర్టు దష్టికి తీసుకుని రాగా.. 2010లో తీర్పు వచ్చిన సందర్భంలో బీసీ జనగణన డేటా లేదని, ప్రస్తుతం ఆ డేటా అంతా నమోదై ఉందని కామత్ వివరించారు. అవేమీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని తేల్చి చెప్పిన కోర్టు పిటీషన్ని కొట్టివేసింది.