తల్లి, కొడుకుల సూసైడ్ అసలు ఏం జరిగింది ?

మెదక్ జిల్లా రామాయంపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన తల్లీకొడుకు అంతిమయాత్ర సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ ఛైర్మన్ ఇంట్లోకి చొచ్చుకెళ్లి నిరసన చేపట్టారు.

కమరేడి పట్టణంలోని లాడ్జిలో రామాయంపేటకు చెందిన తల్లీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడి ఘటన తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. మెదక్ జిల్లా రామాయంపేటకుచెందిన పద్మ, కుమారుడు సంతోష్‌ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

రామాయంపేటకు చెందిన టీఆర్ఎస్ నేతలు, ఓ సీఐ మొత్తంగా ఏడుగురి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రస్తుత మున్సిపల్ ఛైర్మన్ పల్లె జితేందర్ గౌడ్‌తో పాటు ఐరెని పృథ్వి రాజ్ అలియాస్ బాలు, రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, తోట కిరణ్, కన్నాపురం కృష్ణా గౌడ్, సరాఫ స్వరాజ్, అప్పటి సీఐ నాగార్జున గౌడ్ కలిసి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యాపారంలో 50 శాతం వాటా ఇవ్వాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ వేధించారని సెల్ఫీ వీడియోలో సంతోష్ చెప్పుకొచ్చాడు. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారని గతంలో పోలీస్టేషన్‌కు పిలిపించి వేధించారని కన్నీరుపెట్టుకున్నాడు. ప్రస్తుతం నాగార్జున గౌడ్ తుంగతుర్తి సీఐగా విధులు నిర్వహిస్తున్నట్టు సంతోష్ చెప్పారు.

ఈ సెల్ఫీ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో వారి బంధువులు, స్థానికులు పెద్దయెత్తున ఆందోళన చేపట్టారు. తల్లీకొడుకుల మృతదేహాలను రామాయంపేట మున్సిపల్‌ ఛైర్మన్ జితేందర్‌ ఇంటి వద్దకు తీసుకెళ్లిన బంధువులు ఆందోళన చేపట్టారు. ఛైర్మన్ ఇంటిపై రాళ్లతో దాడులు చేశారు.                                                                                                                                                                     
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సంతోష్‌ సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశామని, నిందితులపై ఐపీసీ 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
మున్సిపల్‌ ఛైర్మన్‌ పల్లె జితేందర్‌ గౌడ్, సీఐ నాగార్జున గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ యాదగిరి సహా మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Comment