ప్రస్తుత ఖరీఫ్ (వానాకాలం) ధాన్యం సేకరణకు సంబంధించి పంజాబ్, హరియాణాల తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా ధాన్యం సేకరించినట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించిందని సాక్షి సహా ప్రధాన పత్రికలు పేర్కొన్నాయి.
నవంబర్ 30వ తేదీ వరకు తెలంగాణలో 16.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, దీని విలువ రూ. 3,163.40 కోట్లుగా ఉందని కేంద్రం తెలిపింది. దీనిద్వారా 2.27 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు పేర్కొంది.
అత్యధికంగా పంజాబ్‌లో 9.24 లక్షల మంది రైతుల నుంచి రూ. 36,623 కోట్ల విలువైన 1.86 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, హరియాణలో 3 లక్షల మంది రైతుల నుంచి రూ. 10,839 కోట్ల విలువైన 55.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 4,455 మంది రైతుల నుంచి రూ. 122 కోట్ల విలువైన 62,266 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించినట్లు వివరించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సేకరణ కార్యక్రమం సజావుగా సాగుతోందని వెల్లడించింది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యం మొత్తం 2.90 కోట్ల మెట్రిక్ టన్నులు ఉండగా, కనీస మద్దతు ధరగా రూ. 57,032.03 కోట్లు చెల్లించినట్లు కేంద్రం తెలిపింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఓ రైతు గుండెపోటుతో కుప్పకూలినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది. ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బద్దిపడగ గ్రామానికి చెందిన వడ్లూరి రాములు(42) అదే గ్రామంలో మరో వ్యక్తికి చెందిన ఎకరం పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు.
గ్రామంలో పాలమాకుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి 10 రోజుల క్రితం ధాన్యాన్ని తీసుకువచ్చాడు. ధాన్యంలో తేమ శాతం రావడం కోసం రోజూ ఆరబెడుతూ అక్కడే ఉండిపోయాడు. గురువారం సాయంత్రం అతడి సీరియల్ నంబర్ రావడంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అతనికి బార్దాన్ సంచులు ఇచ్చి ధాన్యం నింపాలని చెప్పారు.