ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గించడంపై మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినట్లు ఆంధ్రజ్యోతి వార్తా పత్రిక కథనం ప్రచురించింది.
ఈ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పునరుద్ధరిస్తారా లేక తగిన ద్రవ్య పరిహారం చెల్లిస్తారో స్పష్టం చేయాలని జస్టిస్ ఎస్.కృపాకరన్, జస్టిస్ పి.పుగళేందితో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు ఈ నెల 17వ తేదీన కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది(జస్టిస్ కృపాకరన్ ఇటీవలే పదవీవిరమణ చేశారు). నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
1962లో తీసుకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన చట్టం కింద లోక్‌సభ స్థానాల సంఖ్య 505 నుంచి 520కి పెరిగింది. అయితే సభలో తమిళనాడు స్థానాల సంఖ్యను 41 నుంచి 39కి తగ్గించారు. ఉమ్మడి ఏపీ సీట్లు కూడా 43 నుంచి 41కి తగ్గాయి. (1977లో 42కి పెరిగాయి). పునర్వ్యవస్థీకరించిన సీట్లతో 1967లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి.
జనాభాను విజయవంతంగా నియంత్రించిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లోక్‌సభలో రెండేసి స్థానాలను కోల్పోయాయని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తుచేసింది. జన నియంత్రణ కార్యక్రమాలను సరిగా అమలు చేయలేని రాష్ట్రాలకు పార్లమెంటులో అధిక ప్రాతినిధ్యం ఎందుకు కల్పించారని ప్రశ్నించింది. ఈ రెండు రాష్ట్రాలకు అధిక రాజ్యసభ స్థానాలను ఇవ్వడం ద్వారా ఆ నష్టం ఎందుకు పూడ్చకూడదని అడిగింది. లేదంటే ఆర్థిక సహాయం అందించాలని.. 1967 నుంచి రూ.400 కోట్లు.. ఆ లెక్కన 14 ఎన్నికలకు 28 స్థానాలు కోల్పోయినందున తమిళనాడుకు రూ.5,600 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది’ అని కోర్టు తెలిపిందని ఆంధ్రజ్యోతి వివరించింది.
రూ.11 కోట్ల విలువైన కొకైన్ క్యాప్సూళ్లు మింగి.. నీళ్లు తాగినా సరే అవి బయటికి పోతాయేమోనని 10 గంటలకుపైగా కడుపు బిగబట్టి విమానంలో ప్రయాణించిన ఓ నిందితుడిని బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం.. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ప్రయాణికుడు విమానంలో జొహన్నెస్‌బర్గ్ నుంచి దుబాయ్‌కి, అక్కడి నుంచి బెంగళూరుకు చేరుకున్నాడు. ప్రయాణ సమయంలో ఎయిర్ టికెట్ ప్యాకేజీలో భాగంగా అతడికి ఉచితంగా ఆహారం, నీరు, శీతల పానీయం ఇచ్చినా తీసుకోలేదు. పైగా ప్రయాణ సమయంలో మొత్తం అసహనంగా కనిపించాడు. ఈ విషయం గుర్తించిన విమానయాన సంస్థ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తూ కస్టమ్స్ అధికారులకు తెలిపారు.