భారత్‌లో శిక్షణ పొందిన తొలి మహిళా డాక్టర్ కాదంబినీ గంగూలీ. ఆదివారం ఆమె 160వ జయంతిని పురస్కరించుకొని ఆమె అందించిన సేవలను ప్రముఖులు కొనియాడారు.
మరోవైపు గూగుల్ కూడా ప్రత్యేక డూడుల్‌తో ఆమెకు నివాళులు అర్పించింది. కాదంబినీ గంగూలీ 1861 జులై 18న జన్మించారు. భారత్‌లో తొలి మహిళా హక్కుల సంస్థను స్థాపించిన వారిలో ఆమె తండ్రి కూడా ఒకరు. ఆయనే కాదంబినీని దగ్గర్లోని పాఠశాలలో చేర్పించారు. అప్పట్లో అమ్మాయిలు పాఠశాలలో చేరడాన్ని తప్పుగా చూసేవారు.
తన తండ్రి కల్పించిన అవకాశాన్ని కాదంబినీ సద్వినియోగం చేసుకున్నారు. 1883లో బ్రిటిష్ రాజ్ నుంచి డిగ్రీ పట్టా పొందిన తొలి భారత మహిళలుగా కాదంబినీ, ఆమె స్నేహితురాలు చంద్రముఖి బసూయిన్ చరిత్ర సృష్టించారు. డిగ్రీ అనంతరం కాదంబినీ.. సామాజిక కార్యకర్త, ప్రొఫెసర్ ద్వారకానాథ్ గంగూలీని పెళ్లి చేసుకున్నారు. ఆయనే ఆమెను వైద్య విద్య చదివే దిశగా ప్రోత్సహించారు.
చాలా వ్యతిరేకత ఎదురైన అనంతరం, చివరగా కలకత్తా మెడికల్ కాలేజీలో కాదంబినీకి మెడిసిన్ సీటు వచ్చింది. దీంతో 1886లో మరోసారి ఆమె చరిత్ర సృష్టించారు. భారత్‌లో వైద్య పట్టా పొందిన తొలి మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. అయితే, అక్కడితో ఆమె ఆగిపోలేదు. గైనకాలజీలో ఆమె చదువు కొనసాగించారు. బ్రిటన్‌లో చదువుకుంటూనే ఆమె పనిచేశారు. మొత్తంగా వైద్య పట్టాతోపాటు మూడు అదనపు డిగ్రీలను కూడా ఆమె సంపాదించారు.