ఇజ్రాయెల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 8 ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో 12సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు పాలన ముగుస్తుంది. 8 పార్టీలతో కలిసి సంకీర్ణం ఏర్పాటైనట్లు ఎష్ అతిద్ పార్టీ నాయకుడు ప్రకటించారు.
రైట్ వింగ్ యమీనా పార్టీ నాయకుడు నఫ్తాలి బెన్నెట్ తొలుత ప్రధాని పదవిని స్వీకరిస్తారు. రొటేషన్ పద్ధతిలో పదవి బదలీ జరుగుతుంది. ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత లాపిడ్ అధికారంలోకి వస్తారు. అయితే, ఈ సంకీర్ణం ప్రమాదకరమైనదని నెతన్యాహు అన్నారు. ఎన్నికల ద్వారా గెలిచిన సభ్యులు ఈ సంకీర్ణాన్ని వ్యతిరేకించాలని ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్) సభ్యులను నెతన్యాహు కోరారు.
సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టడానికి ముందు పార్లమెంటులో మెజారిటీ ఓటు సంపాదించాలి. అయితే ఈ వోటింగ్ ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించటం లేదు. కొత్తగా ఏర్పాటైన సంకీర్ణంలో అభ్యర్థులు ఈ ఒప్పందం నుంచి వైదొలిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రతిపక్షాలు కుదుర్చుకున్న ఒప్పందం గురించి ఇజ్రాయెల్ అధ్యక్షుడు ర్యూవెన్ రివ్‌లిన్‌కి తెలియచేసినట్లు లాపిడ్ ఒక ప్రకటనలో తెలిపారు. “ఈ ప్రభుత్వానికి ఓటు వేసినా, వేయకపోయినా తమ ప్రభుత్వం ఇజ్రాయెల్ పౌరుల సేవలోనే గడుపుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలను గౌరవించి ఇజ్రాయెల్ సమాజంలో అన్ని వర్గాలను ఐక్యం చేసేందుకు తమ అధికారాన్ని వినియోగించుకుంటామని లాపిడ్ పేర్కొన్నారు. ప్రతిపక్షాల మధ్య ఒప్పందం కుదరటం అసాధ్యం అని భావించారు. ప్రతిపక్ష నాయకులు లాపిడ్, బెన్నెట్, అరబ్ ఇస్లామిస్ట్ రామ్ పార్టీ నాయకుడు మన్సూర్ అబ్బాస్ కలిసి ఒప్పందం పై సంతకం చేస్తున్న ఫొటో ఇజ్రాయెల్ మీడియాలో ప్రచురితమయింది. ఇజ్రాయెలీ అరబ్ పార్టీ సంకీర్ణంలో చేరడం దశాబ్దాల తర్వాత ఇది మొదటిసారి. అయితే, పాలస్తీనాను రాజ్యంగా వ్యతిరేకించే బెన్నెట్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తామని ఇజ్రాయెలీ అరబ్బులకు ప్రాతినిధ్యం వహించే ఇతర పార్టీలు చెబుతున్నాయి. వీరు జనాభాలో 20 శాతం ఉంటారని ఏఎఫ్‌పి వార్తా సంస్థ వెల్లడించింది. “ఈ ఒప్పందంలో చాలా వివాదాలు ఉన్నాయి. ఇది చాలా కష్టతరమైన నిర్ణయం. కానీ, ఈ అగ్రిమెంట్ కుదరడం చాలా ముఖ్యం. అరబ్ సమాజానికి ఉపయోగపడే చాలా అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి” అని అబ్బాస్ విలేఖరులకు చెప్పారు.