తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణకు సంభందించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర కోసం తాను పోరాడతానని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్లీనరీ కొనసాగనుంది.
ఈ సందర్భములో జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ ఎలాంటి పాత్ర పోషిస్తుందనే అంశంపైనే అందరి చూపు మళ్ళింది. ప్లీనరీలో మొత్తం 11 తీర్మానాలను ప్రవేశ పెట్టనుండగా, జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పోషించాల్సిన పాత్ర, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలన వైఫల్యాలు ఎండగట్టడమే ప్రధాన ఎజెండాగా ఉంటుందని పార్టీ నేతలు వెల్లడించారు.
అలాగే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీల పాత్ర పోషించాలని కోరుతూ తీర్మానం ఆమోదించనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా తీర్మానాలు చేయనున్నారు. ఇప్పటికే తీర్మానాల వారీగా వక్తల పేర్లను ఖరారు చేశారు.
టీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీనరీ తీర్మానాలు ఇవే
- యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం.
- దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం.
- ఆకాశాన్నంటిన ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ తీర్మానం.
- చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.
- భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం.