ప్రపంచంలో కరోనావైరస్ చేరని దేశం మాదే’ అంటున్న తుర్క్‌మెనిస్తాన్,అందులో నిజమెంత ?

సయాహత్ కుర్బనోవ్‌కు పేరు మార్చాం ఊపిరి ఆడటం లేదు. మారథాన్‌లో పరుగు పెట్టినప్పుడు మాదిరిగా ఆయన ఊపిరి తీసుకోవడం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. గుండెలో భరించలేనంత నొప్పి వస్తోంది. ఆయనకు కరోనావైరస్ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి.

కానీ తుర్క్‌మెనిస్తాన్‌లో సమస్య ఏంటంటే, ఆయనలాగా ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్న వారి వివరాలు అధికారికంగా నమోదు కావడం లేదు. ఆయన ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతూ అంబులెన్స్‌ని పిలిచినప్పుడు, న్యుమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయని, వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళమని డాక్టర్ సలహా ఇచ్చారు. ఆ దేశంలో డాక్టర్లు కరోనావైరస్‌ను న్యుమోనియాలా పరిగణిస్తున్నారని కుర్బనోవ్‌కు తెలుసు.

ఆయన ఆసుపత్రికి వెళ్లే దారిలో కుర్బనోవ్ అంతకు ముందు కోవిడ్ పరీక్ష చేయించుకున్న క్లినిక్‌కు కాల్ చేశారు. ‘అవును పాజిటివ్’ అంటూ నెమ్మదిగా చెబుతున్న మాటలు నాకు వినిపించాయి. ఏమిటి పాజిటివ్ , కోవిడ్ వచ్చిందా అని గట్టిగా అనగానే, అటునుంచి అవుననే సమాధానం వచ్చింది అని కుర్బనోవ్ చెప్పారు. కానీ, తుర్క్‌మెనిస్తాన్‌లో పాజిటివ్ వస్తే ఆ విషయాన్ని కాగితం పై రాసి మాత్రం ఇవ్వరని ఆయనకు తర్వాత అర్ధమయింది. ఆయన చికిత్స కోసం వెళ్లిన ఆసుపత్రి రోగులతో నిండిపోవడంతో ఆయనను చేర్చుకోవడానికి అంగీకరించలేదు.

నాకు దారిలోనే ప్రాణం పోయినట్లు అనిపించింది అని కుర్బనోవ్ అన్నారు. గాలి అందడం లేదు వైరస్ చాలా త్వరగా వ్యాపించింది. నేను అంబులెన్స్ కిటికీని గట్టిగా కొట్టి ఊపిరి తీసుకోలేకపోతున్నాను, ఆపండి అని గట్టిగా అరిచాను. వాళ్ళు ఆక్సిజన్ ఇచ్చారు కానీ, అది పెద్దగా ఉపయోగపడలేదు అని వివరించారు. తుర్క్‌మెనిస్తాన్‌ రాజధాని అష్గాబాట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోని రోగులను తీసుకోవడం నిషేధం కావడంతో, మరొక ఆసుపత్రి వాళ్ళు కూడా ఆయనను చేర్చుకోలేదు.

నాకు వణుకు పుట్టడం మొదలయింది నేనిప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చనిపోవాలా? అని డాక్టర్ ను అడిగాను. చివరకు ఆయనకు తెలిసిన ఒక డాక్టర్‌కు కాల్ చేసి సహాయం కోసం అడిగారు. చాలా ఫోన్ కాల్స్ , వాదనల తర్వాత చివరకు ఒక ఆసుపత్రిలో ఆయనకు అడ్మిషన్ లభించింది. కానీ, మరొక అయిదు రోజుల వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పూ రాలేదు. “నేను ఊపిరి తీసుకోలేకపోయాను. నా లోపల ప్రతీ భాగం అతుక్కుపోయినట్లు అనిపించింది. ఊపిరి అందకపోవడంతో భయంతో నాకు పానిక్ అటాక్ లు వచ్చాయి. నీటి లోపలికి వెళ్ళాక అక్కడ చిక్కుకుపోయి, బయటకు రాలేకపోయినట్లుగా అనిపించింది” అని ఆయన తాను పడిన వేదనను గుర్తు చేసుకున్నారు.

Leave a Comment